ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబుల తీరు మారడం లేదు. కఠిన చట్టాలు అమలు చేసి జైలు శిక్షలు విధిస్తున్నా...భారీగా జరిమానాలు అమలు చేస్తున్నా వారు తాగి వాహనాలు నడపడం మానడం లేదు. దాదాపు ప్రతి రోజు 73 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కుతుండడమే ఇందుకు నిదర్శనం. గత 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో 24,134 మంది పట్టుబడ్డారు. వీరిలో 6564 మందికి జైలు శిక్ష పడింది. అయినా డ్రంకన్ డ్రైవర్ల తీరుమారకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంద,
సిటీబ్యూరో: మద్యం తాగితే వాహనం నడపొద్దని ఎవరైనా చెబితే మందుబాబులకు రుచించదు. వాహనం నడిపి తీరాల్సిందేనని ఉబలాటపడుతుంటారు. రహదారుల్లో వాహనాలపై దూసుకెళుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం. జరిమానాలు విధిస్తున్నా, జైలుకు పంపుతున్నా వీరిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకు 24,134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అంటే నెలకు 2,194 మంది పట్టుబడితే...రోజుకు సరాసరిన 73 మంది ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. జైలు శిక్షలను పరిశీలిస్తే ఆయా కమిషనరేట్ల పరిధిలో 11 నెలల్లో 6,564 మంది జైలుకెళ్లగా, నెలకు 596 మంది అంటే రోజుకు 19 మందికి సంకెళ్లు పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో మందుబాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.